- రేపు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి
- 8న చలో రాజ్‌భవన్, వచ్చేనెల 1న చలో ఢిల్లీ
- ఓటర్ల అక్రమ తొలగింపుపై ఉమ్మడి పోరాటానికి అఖిలపక్ష పార్టీలు పిలుపు
హైదరాబాద్, వెలుగు: దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని అఖిల పక్షాలు ఫైర్ అయ్యాయి. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. ఆదివారం హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో కాంగ్రెస్, టీజేఎస్, ఎస్పీ, ఆర్జేడీ సహా 9 వామపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈసీ అక్రమ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనల కార్యాచరణను ప్రకటించాయి.
ఈ నెల 6న అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు, 8న గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించేందుకు చలో రాజ్‌భవన్ కార్యక్రమం, నవంబర్ 1వ తేదీన కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చలో ఢిల్లీ పోరాటానికి పిలుపునిచ్చాయి. రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో దాదాపు 1.66 కోట్ల ఓట్లను తొలగించడానికి ఈసీ కుట్ర చేస్తోందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని, ఓటు హక్కును కాపాడుకునేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.
సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహ, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, న్యూడెమోక్రసీ నేత కె. గోవర్ధన్, ఎంసీపీఐ(యు) నేత వనం సుధాకర్, ఆర్జేడీ అధ్యక్షురాలు శోభా యాదవ్, ఎస్పీ అధ్యక్షుడు ప్రొ. సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.
